ఆంధ్రప్రదేశ్ లో ఛానెల్స్ నిలిపివేత అంశంలో కీలక విషయాలు బయట పడుతున్నాయి. కేబుల్ వ్యవస్థను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియా లెజెండ్ గా భావిస్తున్న ఓ ఛానల్ అధినేత తెరవెనుక మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడని, దీనికి కావాల్సిన డబ్బు సమకూర్చుతోంది ఓ ఎంపీ అని టాక్ వినిపిస్తోంది. భవిష్యత్ సీఎం అభ్యర్థిగా పేరున్న ఓ మంత్రి పీఏ ఇందులో కీలక భాగస్వామిగా ఉండేందుకు ప్లాన్ రెడీ అయిందట. వీరంతా మంత్రిని కలిసి సమాలోచనలు చేశారట. ఇందుకు వైసీపీ నుంచి వచ్చిన ఓ నాయకుడు సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది. ఈమేరకు సదరు మంత్రి గారిని కూడా కలసి మంచి బొకే కూడా సమర్పించి వచ్చాడట సదరు నాయకుడు. ప్లాన్ లో భాగంగా ముందుగా చానల్స్ ప్రసారాలను నిలిపి వేస్తారు. ఆ పని ఇప్పటికే షురూ అయింది. పబ్లిక్ ఎక్కువ మంది చూసే ఛానల్స్ ఆగిపోవటం వల్ల కేబుల్ ఆపరేటర్స్ కి నష్టం వస్తుంది. నష్టాల్లో మీరు కేబుల్ నడపటం కష్టం అని చెప్పి మెల్ల మెల్లగా వాటిని స్వాధీనం చేసుకుంటారు. ఏపీలో 60 లక్షల కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 40 లక్షల కనెక్షన్లపై వారి కన్నుపడింది. చెబితే వినని వాళ్ల నుంచి బలవంతంగా అయినా స్వాధీనం చేసుకోవాలని కూడా డిసైడ్ చేసారు. ఇలా కేబుల్ కంట్రోల్ లో ఉంటే న్యూస్ చానల్స్ తమ నియంత్రణలో ఉంటాయని పెద్దలను ఒప్పించి సదరు మీడియా లెజెండ్ పావులు కదుపుతున్నాడట. ఇవన్నీ చేసి పెట్టినందుకు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఏపీ ఫైబర్ గ్రిడ్ ను కూడా తనకు అప్పగించాలని సదరు మంత్రిని కోరాడట ఈ మీడియా లెజెండ్.ఏపీలోను కేబుల్ మోనోపోలికి చేయాలని వీళ్ల కుట్ర. దీంతో ఇక చిన్నా చితకా ఆపరేటర్లు మటుమాయం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కొందరికి తృణమో.. పణమో ఇచ్చి అతి త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నారు. మాట వినని వాళ్లకు బడిత పూజ చేయాలని డిసైడ్ చేశారట. ఇటీవల అతిపెద్ద కేబుల్ నెట్ వర్క్ ను అతి తక్కువ రేటుకు కొట్టిసిన తరహాలోనే ఇవన్ని చేయాలన్నది వీళ్ల ప్లాన్ అని టాక్ వినిపిస్తోంది. కేబుల్ చేతిలో ఉంటే ఛానల్ అన్నిటిని తమకు ఇష్టమైన తరహాలో కంట్రోల్ లో పెట్టవచ్చు అని ఆ మీడియా లెజెండ్ ఇచ్చిన సలహా అందరికీ నచ్చిందని రాజధానిలో టాక్. అంటే.. ఏపీ కేబుల్ వ్యవస్థ మొత్తం ఆ మీడియా లెజెండ్, ఆ ఎంపీ, ఆ మంత్రి గారి పీఏ. ఇలా ముగ్గురి వశమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం బయటికి రావటంతో బాబుకు కంప్లైంట్ చేసేందుకు సిద్ధమయ్యారు కొందరు కేబుల్ ఆపరేటర్స్. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.