ప్రజాస్వామ్యం పచ్చగా ఉండాలంటే ప్రతిపక్షం తప్పనిసరి. ప్ర‌జాస్వామ్యంలో మీడియా పాత్ర కూడా కీల‌కం. మీడియా, ప్ర‌తిప‌క్షం లేకుండా సాగే పాల‌న ఏక‌ప‌క్షంగా సాగుతుంది. అయితే ఇటీవ‌ల ఆంధ్రప్రదేశ్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అధికార పార్టీ త‌మ‌కు ఆందోళ‌న క‌లిగించే చ‌ర్యలు చేప‌డుతోందంటూ ప్ర‌తిప‌క్ష వైసీపీ ఆరోపిస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక త‌మ పార్టీ ఆఫీసుల‌ను కూల్చేవేస్తోంద‌ని, రాజకీయ కక్షలో భాగంగానే ఈ కుట్ర‌లు చేస్తోంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ చేసే కుట్ర‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని చెబుతున్నారు.

అధికార ప్రతిపక్షాల మధ్య విభేదాలు ఉండటమనేది సాధార‌ణ‌మే. కానీ.. త‌మ అభిప్రాయాలను వ్యక్తీకరించే లేదా ప్ర‌శ్నించే గళాన్ని తమ చర్యలతో అణగదొక్కడం ఏ ప్ర‌భుత్వానికి మంచిది కాదు. రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన ఏ నాయకుడూ ఈ విషయాన్ని మరచిపోకూడదు. ఇలాంటి నిరంకుశ చర్యలను ప్ర‌జ‌లు ఎప్పుడూ సమర్థించరు. స‌రైన స‌మ‌యంలో బుద్ది చెబుతారు. గ‌తంలో ఇలాంటి ప‌రిణామాల‌ను ఎన్నో చూశాం.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెప్పిన మాట.. ప్ర‌భుత్వాల‌కు వ‌ర్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని.. అయితే ఏకాభిప్రాయంపైనే పాలన ఆధారపడి ఉంటుందని నరేంద్ర మోదీ ఎలాంటి సందిగ్ధత లేకుండా చెప్పారు. ఇది కేవలం ‘రాజ్యాంగ నైతికత’కి సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు, చట్టపరమైన బాధ్యత కూడా. ‘సబ్ కా సాథ్.. సబ్ కా విశ్వాస్’.. ఈ నినాదంలో చాలా గొప్పతనం ఉంది. ముఖ్యమైంది ఏమిటంటే.. ఆలోచన అనేది ఆచరణలో కూడా కనిపించాల్సి అవసరం ఉంది. ఒకనొక సందర్భంగా.. భారత ఫెడరలిజం గురించి మాట్లాడిన మోదీ.. ‘సహకార పోటీ’ గురించి కూడా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి వారే కాదు మిగతా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా తమ రాష్ట్రాల్లో ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించి ఆచ‌రించాలి.

ఇటీవ‌ల ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే, అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మపై విమ‌ర్శలు గుప్పించిన ఓ న్యూస్ ఛానెల్‌ మీద.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే నిషేధం విధించారు. ఆ టీవీ ఛానెల్‌కు తెలుగు మాట్లాడేవారిలో 70 శాతానికి పైగా వీక్షకులు ఉన్నారు. అయితే.. విమర్శించే గొంతును నొక్కేందుకు చేసిన ప్రయత్నం మిస్ ఫైర్ అయింది. హైకోర్టులో ఆ ఛానెల్‌కు ఉపశమనం దొరికింది. పత్రికలు, మీడియా అనేది.. ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్ అని.. ప్ర‌భుత్వాలు గ్రహించాలి. ప్ర‌జ‌ల‌కు – ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధిగా ఉండేదే మీడియా. అలాంటి మీడియాను అణచివేయడానికి విమర్శించే గొంతు నొక్కేయటానికి ప్రయత్నించటమనేది.. భావప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును హరించి వేయటమే అవుతుంది.

ఎన్నికల్లో చంద్రబాబుకు సంచ‌ల‌న విజ‌యం అందించారు ప్ర‌జ‌లు. అయితే ఎంతో అనుభవం, తెలివితేటలున్న ఆయ‌న‌కు.. ఈ ఎన్నికల్లో దక్కిన అదృష్టం ఎప్పుడైనా కీలక మలుపు తీసుకునే అవకాశాలు క‌ల‌గ‌వ‌చ్చు. వచ్చే ఐదేళ్ల వరకు ఆయన సంఖ్యాపరంగా మెజారిటీని నిలుపుకోవచ్చు కానీ.. ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించడం మాత్రం అసాధ్యం. ఆయనతో పాటు కూటమిలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు, విభిన్న ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఓ రాజనీతిజ్ఞుడిలా ప్రవర్తించాలి. సిసలైన ప్ర‌జా నాయ‌కుడిగా రూపాంత‌రం చెందాలి. గతంలో ముఖ్య‌మంత్రిగా పాలించిన స‌మ‌యంలో చంద్రబాబు తనను తాను ఓ విజనరీ లీడర్‌గా నిరూపించుకున్నారు. ఫ్యూడల్ నిజాం షాహీల కాలం నాటి హైదరాబాద్‌పై పూర్తిగా అభిప్రాయం మార్చుకునేలా.. సిలికాన్ వ్యాలీతో పోటీపడేలా సైబరాబాద్‌గా ఎలా మార్చారో గుర్తుచేసుకోవాలి. యోధుడు ఎప్పుడూ ఓడిపోయిన వారిని నామరూపాల్లేకుండా చేయాలని అనుకోడు. ఆ విష‌యం గ‌మ‌నించి న‌డుచుకోవాల్సిన స‌మ‌య‌మిది. ప్రతిపక్షం, భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం నిల‌వ‌దు, నిల‌బ‌డ‌దు అని గ్ర‌హించాలి. నిరంకుశ అధికారులు, నిరంకుశులకు కూడా ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేలా ప్ర‌య‌త్నించాలి. క‌క్ష్య సాధింపు వ్య‌వ‌హారాలు ప‌క్క‌న‌బెట్టి, ప్రజల సంక్షేమం కోసం పాటుప‌డాల్సిన స‌మ‌య‌మిది.

  • వ్యాసకర్త: పుష్పేష్ పంత్, ఒక భారతీయ విద్యావేత్త, విమర్శకుడు మరియు చరిత్రకారుడు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. అతను అంతర్జాతీయ సంబంధాలు, భారతీయ వంటకాల అధ్యయనం చేస్తున్న ప్రముఖ నిపుణులు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *